Wednesday 29 May 2013

అరిగేశక్తి పెరిగేదెలా?

అబ్బా... ఏం తిన్నా పొట్ట రాయిలా టైట్‌గా ఉంటోంది’... ‘ఏమిటో ఈమధ్య ఏదైనా తినగానే ఛాతీ పొడవునా కింది వరకూ మంట’... ‘ఏదైనా తింటే చాలు వెంటనే కడుపు ఉబ్బుకుపోయినట్లుగా అవుతోంది’... ‘ఇదిగో తిన్నదేమీ లేదుగాని పొద్దస్తమానం ఇలా తేన్పులు’... ఇవీ నలుగురు కూడి కలిసిన చోట్ల మాట్లాడే మాటల్లో కనీసం ముగ్గురికి ఎదురయ్యే సమస్యలు. మామూలు వాళ్లకి ఇదో ఇబ్బందా అనిపించినా, మనకు తెలియకుండానే జీవనశైలిని ప్రభావితం చేసే ఎన్నో ఇక్కట్లు. మూడు పదులు దాటగానే కనిపించే జీర్ణసంబంధమైన సమస్యలెన్నో. నేడు ప్రపంచ జీర్ణవ్యవస్థ ఆరోగ్యదినం సందర్భంగా తిన్న ఆహారం అరుగుదల విషయంలో మనం రోజూ ఎదుర్కొనే సాధారణ సమస్యలూ, వాటి పరిష్కారాల వంటి అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. - 

ఇప్పుడు ఏ ఇంట్లోనైనా తిన్న ఆహారం సరిగా జీర్ణం కావడం లేదనే మాట వినిపిస్తే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ తమకు మలబద్దకం ఉందనో, కిందినుంచి గ్యాస్ పోతోందనో, గుండెలపై మంటగా ఉంటోందనో చెప్పడం పరిపాటి. జీర్ణవ్యవస్థకు సంబంధించిన కొన్ని ఈ తరహా సమస్యల గురించి, వాటికి సాధారణ పరిష్కారాల గురించి తెలుసుకుందాం. 



ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్): దీని గురించి వింటే ఇదో జబ్బా అనిపిస్తుంది. కానీ ఎంతో ఇబ్బంది పెడుతుంది. లక్షణాలను పరిశీలిస్తే... ఒక్కోసారి మలబద్దకం, కొన్నిసార్లు నీళ్ల విరేచనాలు... కొన్నిసార్లు ఈ రెండూ కలిసి ఉన్నట్లు అనిపిస్తాయి. ఉబ్బినట్లుగా ఉన్న పొట్ట, కింది నుంచి గ్యాస్ పోవడం మామూలే. సాధారణ ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కాకపోతే సామాజిక జీవనానికి ఎన్నోఅడ్డంకులు. ఎక్కడకు వెళ్లినా బాత్‌రూమ్ ఎక్కడ ఉందో అని మొదట వెతుక్కోవాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితి. 

కారణమేమిటి: ఐబీఎస్‌కు నిర్దిషమైన కారణం తెలియకపోయినా... మనలోని జీర్ణక్రియ ఒక పద్ధతి ప్రకారం జరిగిపోతుంది. రోజూ ఉదయాన్నే మలవిసర్జన మొదలుకొని, ఆయా వేళలకు ఆకలై తినాలనిపించడం అంతా మెదడునుంచి ఒక క్రమబద్ధమైన రీతిలో జీర్ణవ్యవస్థకు అందే ఆదేశాల ఆధారంగా జరుగుతుంది. ఏదైనా కారణాల వల్ల మెదడుకూ, జీర్ణవ్యవస్థకూ మధ్య సమాచార వ్యవస్థ దెబ్బతిని, అక్కడినుంచి అందే ఆదేశాలు అస్తవ్యస్తమైతే అది ఐబీఎస్‌కు దారితీస్తుందన్నది ఒక వాదన. ఇక రోజువారీ జీవితంలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొనేవారిలో ఇది ఎక్కువ. ఏదైనా ఒత్తిడితో కూడిన పరిస్థితి ఎదురుకాగానే బాత్‌రూమ్‌కు వెళ్లాలనిపించడం చాలామందిలో కనిపించే లక్షణమే. 

అధిగమించడం ఎలా: ఆహారానికీ, ఐబీఎస్‌కూ ఏదో తెలియని అంతర్లీన సంబంధం ఉందన్న విషయాన్ని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రధానంగా ‘ఫోడ్‌మ్యాప్స్’ అనే ఆహారం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువవుతోందన్న వాదన వినిపిస్తోంది. ఫోడ్‌మ్యాప్ ఆహారం అంటే... మనం తిన్న తర్వాత పేగుల్లో పూర్తిగా జీర్ణం కాకుండా కేవలం పాక్షికంగా మిగిలిపోయే ఆహారం అన్నమాట. ఇది అలా పాక్షికంగా జీర్ణమై మిగతాది మిగిలిపోవడంతో అది పులియడం (ఫెర్మెంటేషన్)మొదలవుతుంది. ఈ ప్రక్రియలో గ్యాస్ వెలువడటం, అది కింది నుంచి మాటిమాటికీ పోతూ ఉండటం, గ్యాస్ నిండిపోయి పొట్టబిగుతయ్యేలా చేయడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. 

ఫోడ్‌మ్యాప్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు: మనం తినే ఆహారంలో కృత్రిమ చక్కెరలు, కొన్ని తీపిపదార్థాలు, పాలు, పండ్లలో మామిడి, ఆపిల్, కూరగాయల్లో బీట్‌రూట్, క్యాబేజీ, ఉల్లి వంటివి ఎక్కువ ఫోడ్‌మ్యాప్స్ ఉంటాయి. కాబట్టి వీటిని పరిమితంగానే తీసుకోవాలి. 

ఫోడ్‌మ్యాప్స్ తక్కువగా ఉండే ఆహారాలు: అరటిపండ్లు, నేరేడు, ద్రాక్ష, నిమ్మ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ వంటి వాటిల్లో ఫోడ్‌మ్యాప్స్ తక్కువగా ఉంటుంది. ఇలాగే గుమ్మడి, పాలకూర, టొమాటో, చిలగడదుంప (మోరంగడ్డ), కొత్తిమీర, అల్లం, ల్యాక్టోజ్ లేని పాలు, ఆలివ్ ఆయిల్, పెరుగు వంటి వాటిల్లోనూ ఫోడ్‌మ్యాప్స్ తక్కువ. ఇక గోధుమల కంటే వరి, ఓట్స్‌లో ఫోడ్ మ్యాప్స్ తక్కువ. 

గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే... ఐబీఎస్‌తో బాధపడేవారు ఫోడ్‌మ్యాప్స్ తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఫోడ్‌మ్యాప్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని వీలైనంత తక్కువగా తీసుకోవాలి. 

కడుపులో గ్యాస్

ఇది చాలావరకు చాలామంది నిశ్శబ్దంగా అనుభవించే సమస్య. చెప్పుకోడానికి ఒకింత ఇబ్బంది పడే విషయం కూడా. మనం ఆహారాన్ని మింగే సమయంలో గాలి మన జీర్ణవ్యవస్థ పొడవునా ఎప్పుడూ పెరిస్టాలిటిక్ చలనం రూపంలో వెళ్తూనే ఉంటుంది. ఇది పైనే ఉంటే తేన్పు రూపంలో వెళ్తుంది. కానీ జీర్ణవ్యవస్థలో పైకి రాలేని విధంగా కిందన ఉంటే మలద్వారం గుండా పోతుంటుంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 

ఎవరెవరు గ్యాస్ ఎక్కువగా మింగుతుంటారు? 

బాగా వేగంగా తినేవారు, బాగా వేగంగా తాగేవారు 

పొగతాగే అలవాటు ఉన్నవారు 

చ్యూయింగ్‌గమ్ నమిలేవారు 

ఎప్పుడూ ఏదో చప్పరిస్తూ ఉండేవారు 

కార్బొనేటెడ్ డ్రింక్స్ / కూల్‌డ్రింక్స్ (గ్యాస్ ఉన్నవి) ఎక్కువగా తాగేవారు వదులుగా ఉండే కట్టుడుపళ్లు ఉన్నవారు... వీరంతా గ్యాస్ ఎక్కువగా మింగుతుంటారు. అలాగే కొన్ని రకాల ఆహారాలు తీసుకునేవారిలోనూ గ్యాస్ ఎక్కువగా పోతుంటుంది. 

గ్యాస్‌ను పెంచే ఆహారాలు: 

బీన్స్ 

కూరగాయల్లో బ్రాకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉల్లిగడ్డలు 

పండ్లలో పియర్స్, ఆపిల్స్ 

పొట్టు ఉన్న ధాన్యాల్లో గోధుమలు 

గ్యాస్ ఉన్న పానీయాల్లో సోడాలు, కూల్‌డ్రింక్స్ 

పాలు, పాల ఉత్పాదనల్లో ఛీజ్, ఐస్‌క్రీములు, పెరుగు 

ప్యాకేజ్‌డ్‌ఫుడ్స్‌లో బ్రెడ్ వంటివి తినేవారిలో గ్యాస్ పోవడం ఎక్కువ. 


గ్యాస్ తగ్గడానికి పరిష్కారం ఏమిటి? 
ఆహారం తీసుకునే సమయంలో గాలి ఎక్కువగా నోట్లోకి పోకుండా చేయడం వల్ల చాలావరకు గ్యాస్ సమస్య అధిగమించవచ్చు. 

జాగ్రత్తలు: 
తినేసమయంలో మెల్లగా, నింపాదిగా తినాలి. 

పెదవులు మూసి తినడం మంచిది. 

పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయాలి. 

మీకు కట్టుడు పళ్లు ఉంటే డెంటిస్ట్ సహాయంతో అవి సరిగా అమరేలా చూసుకోవాలి. 

సోడాలు, కూల్‌డ్రింక్స్, బీర్ వంటి వాటికి దూరంగా ఉండాలి. 

పండ్లను కొరికి, నమిలి తినాలి. 

గ్యాస్ ఉండే ఆహారాలను పరిమితంగా తీసుకోవడం వంటి జాగ్రత్తలతో చాలావరకు ఈ సమస్యను అధిగమించవచ్చు. 

మందులు: మనం బీన్స్ లేదా గ్యాస్‌కు దోహదం చేసే కూరగాయలతో ఎక్కువగా భోజనం చేసినప్పుడు డాక్టర్ల సలహా మేరకు అల్ఫా-గెలాక్టోసైడేజ్ మందులు తీసుకోవడం ద్వారా గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. 

కడుపులో గ్యాస్ పెరిగి ఇబ్బందికరమైన నొప్పితో బాధపడుతున్నప్పుడు డాక్టర్ సలహా మేరకు సెమైథికోన్ (గ్యాస్-ఎక్స్, మైలాంటా గ్యాస్) వంటి మందులతో ఈ సమస్యను అధిగమించవచ్చు. 

గమనిక: పాలు, పాల ఉత్పాదనలు తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరంగా మారిపోయి, గ్యాస్ సమస్య పెరుగుతుంటే... మార్కెట్‌లో ఇటీవల ల్యాక్టోజ్ రహిత పాలు, పాల ఉత్పాదనలు దొరుకుతున్నాయి. వీటితో మీ జిహ్వను సంతృప్తి పచుకోవడంతో పాటు, గ్యాస్ సమస్యను దూరం చేసుకోవచ్చు. 

నిర్వహణ: యాసీన్




జీర్ణసంబంధమైన సమస్యలకు పరిష్కారాలు 

రోజుకు రెండు మూడుసార్లు ఎక్కువెక్కువగా తినడం కంటే... తక్కువ మోతాదుల్లో 4, 5 సార్లు తినండి. 

మీ ఆహారంలో పీచు ఎక్కువగా ఉండేవి ఎక్కువగా తీసుకోండి. ఇందుకోసం పొట్టుతో ఉండే ధాన్యాలతో చేసిన ఆహారం, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తినండి. 

ఆహారంలో చేపలను వారంలో కనీసం రెండు-మూడుసార్ల కంటే ఎక్కువగా తీసుకోవడం మంచిది. 

ఎక్కువ కొవ్వుతో ఉండేవి, బాగా వేయించిన ఆహారపదార్థాలను వీలైనంత పరిమితంగా తీసుకోండి. 

తినకముందే పాక్షికంగా పులిసే పదార్థాలైన ఇడ్లీ, దోసెల వంటివాటిని (పూరీ, చపాతీల కంటే) మీ బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఎక్కువగా తీసుకోండి. అలాగే ఇలా పులిసేందుకు అవకాశమున్న పెరుగు, మజ్జిగ వంటి ఆహారాల్లో మన జీర్ణవ్యవస్థకు మేలు చేసే ‘ప్రో-బయాటిక్’ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి. అయితే అది పూర్తిగా పులియకముందే తాజాగా ఉన్నప్పుడు తినడం మంచిదని గుర్తుంచుకోండి. 

మాంసాహారం తీసుకోవాలనిపించినప్పుడు వేటమాంసం, గొడ్డు మాంసం కంటే కొవ్వు తక్కువగా ఉంటే చికెన్‌ను ఎంచుకోండి. 

రోజూ కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు తాగండి. కాఫీలు, ఆల్కహాలిక్ డ్రింక్స్‌కు దూరంగా ఉండండి. 

రోజూ వ్యాయామం చేయండి.

పొగతాగే అలవాటుకు దూరంగా ఉండండి. 

బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి.




ఛాతీ/కడుపులో మంట 

ఆహారం తిన్న తర్వాత సరిగా అరగకపోవడం, కొన్ని పదార్థాలు తిన్న తర్వాత అవి ఛాతీలోపల అంటిపెట్టుకున్నట్లుగా ఉండటం, ఛాతీలోనో, గుండెలోనో, కడుపులోనో మంటగా అనిపించడం అన్న సమస్య మనలో చాలా మంది నిత్యం ఎదుర్కొనేదే.

ఎందుకిలా జరుగుతుంటుంది: 
మనం ఆహారం తీసుకున్న వెంటనే దాన్ని జీర్ణం చేసేందుకు కడుపులో కొన్ని ఆమ్లాలు (యాసిడ్స్) స్రవిస్తాయి. కడుపులో మాత్రమే స్రవించాల్సిన ఆ యాసిడ్స్ కొందరిలో కడుపునకు పై భాగంలో ఉండే బిరడా వంటి స్ఫింక్టర్ కండరం కాస్తంత వదులైనందువల్ల పైకి చిమ్ముతుంటాయి. దాంతో సదరు యాసిడ్ ప్రభావంతో గొంతులో ఆహారం పయనించే మార్గంలో పైకి పయనించే ఈ ప్రక్రియను యాసిడ్ రిఫ్లక్స్ అని వ్యవహరిస్తుంటారు.

ఈ సమస్యకు దోహదపడే అంశాలు 
రోజూ తీసుకునే మోతాదుకంటే ఎక్కువగా ఆహారం తినడం.

ఎక్కువగా నమలకుండానే గబగబా ఆహారాన్ని మింగేయడం

కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం.

అసిడిక్ నేచర్ (ఆమ్ల స్వభావం) ఎక్కువగా ఉండే ఆహారాలైన

టమాటా, నిమ్మ జాతి పండ్లు, పులుపు ఎక్కువగా ఉండే పండ్లు, కూల్‌డ్రింక్స్‌లో కార్బొనేటెడ్ కోలా డ్రింక్స్ ఎక్కువగా తాగడం, కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, కొన్ని సందర్భాల్లో టీ ఎక్కువగా తాగడం వంటి అంశాలన్నీ ఛాతీలో మంట, గుండెల్లో మంటకు దోహదపడతాయి. పైన పేర్కొన్న వాటిని చాలా పరిమితంగా తీసుకోవడం లేదా వీలైతే తీసుకోకుండా ఉండటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. 

0 comments:

Post a Comment